70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా పోతుంది : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
దేశంలో పేదరికం అంతరించిపోవాలంటే వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరోమారు అభిప్రాయపడ్డారు. భారత్.. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ గతంలో ఆయన పిలుపునిచ్చారు. దీనిపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
తాజాగా ఈ పని వేళల అంశంపై మరోసారి మాట్లాడిన నారాయణమూర్తి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. వారానికి 70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా అధిగమించగలమన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం.
అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?' అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ మధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఎ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ది రికార్డ్' అనే పాడ్కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.