శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (15:46 IST)

చెన్నైలో మార్కెట్లకు పోటెత్తిన ప్రజలు.. ఎందుకో తెలుసా?

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న మెట్రో నగరాల్లో చెన్నై ఒకటి. ఇక్కడ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నాలుగు రోజుల పాటు కఠిన ఆంక్షలతో కూడిన కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. దీంతో శనివారం జ‌నం మార్కెట్ల‌కు పోటెత్తారు. కూర‌గాయ‌లు, కిరాణా దుకాణాల‌కు ఎగ‌బ‌డ్డారు. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తంజావూరు, సేలం, తిరుపూర్, నెల్లై, కాంచీపురం, తదితర పట్ణాల్లో మార్కెట్ల వద్ద జనం పోటెత్తారు. అలాగే, నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు కిరాణా షాపుల ముందు బార్లు తీరారు.
 
ఈ లాక్‌డౌన్ అమల్లోకి వస్తే ప‌రిస్థితి కష్టంగా ఉంటుంద‌ని భావించిన జ‌నం.. వేల సంఖ్యలో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఆ టెన్ష‌న్‌లో వారంతా సామాజిక భౌతిక దూరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
ఇదిలావుంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నాలుగు రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ అమలుకానుంది. కేవ‌లం మొబైల్ వెజిటెబుల్ ఔట్‌లెట్స్ ద్వారా మాత్ర‌మే కూర‌గాయ‌లు అమ్ముతారు. ఆస్పత్రులు ఫార్మసీలు, మెడిక‌ల్ షాపులను తెరిచి ఉంచ‌నున్నారు. లాక్‌డౌన్ అయిన న‌గ‌రాల్లో రెండు ద‌ఫాలు డిస్ఇన్‌ఫెక్ష‌న్ డ్రైవ్‌లు నిర్వ‌హిచ‌నున్నారు.
 
ఏటీఎంలు, అన్నా క్యాంటీన్లు తెరుచుకుని ఉంటాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. త‌మిళ‌నాడులో ఇప్ప‌టివ‌ర‌కు 1800 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. 22 మంది మ‌ర‌ణించారు. చెన్నైలో 452, కోయంబ‌త్తూర్‌లో 141, తిరుపుర్‌లో 110, మ‌ధురైలో 56, సేల‌మ్‌లో 30 కేసులు న‌మోదు అయ్యాయి.