శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పెళ్లికాలేదనీ శివలింగాన్ని చోరీ చేసిన యువకుడు.. ఎక్కడ?

Lord shiva
తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ తనకు ఇంకా పెళ్లి కాలేదన్న అక్కసుతో ఓ యువకుడు ఏకంగా శివలింగాన్నే చోరీ చేశాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశంభి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి  రోజూ స్థానికంగా ఉండే భైరవ బాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసేవాడు. తనకు పెళ్లి చేసుకునే భాగ్యం కల్పించాలని తన ఇష్టదైవాన్ని ప్రార్థించేవాడు. అందుకు సరైన అమ్మాయి లభించాలని దేవుడిని ప్రతి రోజూ ప్రార్థించేవాడు.  అలా కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశాడు. 
 
అయితే, అతను ఎన్ని పూజలు చేసినప్పటికీ అమ్మాయి లభించలేదు. చివరకు అసహనానికి గురైన చోటూ గత నెల 31వ తేదీన స్థానిక ఆలయంలో ఉండే శివలింగాన్ని అపహరించాడు. ఆలయంలో ఉన్నట్టుండి శివలింగం కనిపించకపోవడంతో స్థానిక భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
వారు ఆలయం వద్దకు వచ్చి అనేక మంది భక్తులను విచారించారు. అయితే, చోటూ అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి  తీసుకున్న పోలీసులు.. విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. 
 
తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ, అమ్మాయి దొరక్కపోవడంతోనే విసుగు చెంది శివలింగాన్ని అపహరించినట్లు తెలిపాడు చోటూ. ఆలయానికి సమీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.