సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (17:58 IST)

షర్మిల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్.. కారణం అదేనా?

వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా వైఎస్‌ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
 
ఇక 21 రోజులు 6 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో చేసిన పాదయాత్రలో వందల సమస్యలు చూశామని షర్మిల పేర్కొన్నారు. వాటిపై ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపామని వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పడం భావ్యమా? అని ప్రశ్నించారు. రైతుల కోసం ఎన్నో చేస్తే ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని నిలదీశారు.
 
తెలంగాణ రాష్ట్రంలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని ఓ సర్వే చెప్పిందని షర్మిల అన్నారు. రాష్ట్రంలోని వరి రైతులకు సంఘీభావంగా శుక్రవారం 72 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దీక్ష చేయనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ధాన్యం రాశులే ఉన్నాయన్నారు. వడ్లు కొనకుంటే ఆత్మహత్యలే దిక్కని రైతులు చెబుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు