గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (21:29 IST)

రొయ్యల పకోడి ఎలా చేయాలో తెలుసా?

సీ ఫుడ్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. చికెన్, మటన్ కన్నా కూడా సీఫుడ్ చాలా మంచిదంటారు వైద్యులు. సీఫుడ్‌లో రొయ్యలంటే ఇష్టపడని వాళ్లుండేరేమో. రొయ్యలతో కేవలం కూర, బిర్యానీలే కాదు టేస్టీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో రొయ్యలతో చేసిన పకోడీ పిల్లలకు స్నాక్స్‌లా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి రొయ్యలపకోడి ఎలా చేయాలో చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు - 20,
శనగపిండి - రెండు టీస్పూనులు,
బియ్యప్పిండి - ఒక టీస్పూను,
మొక్క జొన్న పిండి - ఒక టీస్పూను, 
ఉల్లిపాయల తరుగు - ఒక కప్పు,
కొత్తిమీర తరుగు - అరకప్పు, 
కరివేపాకు తరుగు - పావు కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, 
కారం - ఒక టీస్పూను,
పసుపు - చిటికెడు,
నిమ్మరసం - ఒక స్పూను, 
ఉప్పు, నూనె - సరిపడినంత.
 
తయారు చేసే విధానం 
రొయ్యలు బాగా కడిగి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఆ బౌల్‌లో శనగపిండి, బియ్యంపిండి, మొక్కొజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. కాస్త నీరు చేర్చి మళ్లీ కలపాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటూ పక్కన అలానే పక్కన పెట్టుకోవాలి. 
 
అనంతరం కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేసి వేడిచేయాలి. పకోడీలు లాగా నూనెలో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసేయాలి. వీటిని టమాటా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి.