బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (22:29 IST)

ఆద్యంతం అలరించిన జూక్ బాక్స్ జామ్ నైట్ మ్యూజికల్ ఈవెంట్

కరోనా సమయంలో అంతా ఆన్‌లైన్ అవుతున్న క్రమంలో తాజాగా జూక్ బాక్స్ జామ్ నైట్ మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. అనాథలకు అండగా నిలిచే ఆశ్రీ అనే సంస్థకు సహాయం కోసం ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత విభావరికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌తో పాటు అనేక ఇతర తెలుగు సంస్థల మద్దతు అందించాయి.
 
ప్రముఖ సంగీత దర్శకుడు గురు.కె.రామాచారి నేతృత్వంలో జూక్ బాక్స్ జామ్ నైట్ మ్యూజికల్ ఈవెంట్ వినులవిందుగా సాగింది. అటు అమెరికాలో ఉంటున్న రామాచారి శిష్య బృందం ఈ సంగీత విభావరిలో తమ టాలెంట్ చూపెట్టింది. ఆన్‌లైన్ ద్వారా ఈ ఈవెంట్‌ను వేలమంది వీక్షించారు. అమెరికాలో ఉండే తెలుగు కళాకారులను ప్రోత్సాహించి వారి ప్రతిభ ప్రదర్శనకు వేదికలా ఈ జూక్ బాక్స్ జామ్ మ్యూజికల్ ఈవెంట్ దోహాదపడింది.
 
ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ మీడియా ఇలాంటి సరికొత్త ఆలోచనకు ఊపిరిపోస్తే.. సంజీవని కల్చరల్ సోసైటీ, ఈవెంట్స్ అన్ లిమిటెడ్ సంస్థలు ప్రధాన బాధ్యతతో ఈ ఈవెంట్ నిర్వహాణలో పాలుపంచుకున్నాయి. నాట్స్‌తో పాటు మరికొన్ని స్థానిక తెలుగు సంస్థలు ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశాయి.
 
రామచారితో పాటు ప్రముఖ గాయనీ గాయకులు సాకేత్, పృద్వీ చంద్ర, రమ్య బెహరా, ఐశ్వర్య దరూరి, హరికా నారాయణ్ తదితరులు తమ పాటలతో ఆద్యంతం అందరిని అలరించారు. ఇమిటేషన్ రాజు... మిమిక్రీతో నవ్వులు పూయించారు. తెలుగు సినిమా పాటల ప్రవాహాన్ని వీక్షకులు ఆన్‌లైన్ ద్వారా వీక్షించి తమ హార్షాన్ని వ్యక్తం చేశారు.  ఇలాంటి సేవా కార్యక్రమాలకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలియచేసారు.