డల్లాస్‌లో అంగరంగ వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు
డల్లాస్ నాట్స్ తెలుగువేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారు పదివేల మందికి పైగా విచ్చేశారు. తెలుగు ఆట, పాటలతో ఆద్యంతం వినోద భరితంగా సాగిన తెలుగు వేడుకలు డల్లాస్‌లో తెలుగువారికి మధురానుభూతులను పంచాయి. ప్రముఖ సినీ గాయకుడు కార్తీక్ పాటల ప్రవాహంలో తెలుగు ప్రజలు తడిసి ముద్దయ్యారు. కార్తీక్ పాటకు లేచి మరీ చిందులేస్తూ వారిలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
ఇదే తెలుగు వేడుకల వేదికపై ప్రముఖ నటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. దీంతో పాటు ప్రముఖ కవి కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రికి కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించి దానిని వారి కుటుంబ సభ్యులకు అందించింది. స్థానిక శ్రీచక్ర కళా నిలయం, రాగమయూరి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ శాస్త్రీయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఐక్య బ్యాండ్, తాళం పరై & పాయిల్ ఆన్‌లైన్ వారి డప్పు నృత్యం, మధురాజ్ డ్యాన్స్ గ్రూపు తెలుగుపాటలకు డ్యాన్స్ వేసి ప్రేక్షకుల్లో జోష్‌ని నింపారు. రోబో గణేశన్ ప్రదర్శన కూడా అందరిని అలరించింది.
హీరోయిన్ కాథెరీన్ ట్రెసా, హీరో, హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి, హీరో సత్యం రాజేష్‌ల ప్రత్యేక సంభాషణ, ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభానుల వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి.
మహిళా సాధికారత, వ్యాపార సదస్సులు, సాహిత్య కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస సదస్సులు, సినీ తారలతో ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. డల్లాస్ తెలుగు వేడుకల వేదికపై నాట్స్ స్టూడెంట్స్ స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈసందర్భంగా డా. మధు కొర్రపాటి, డా.సుధీర్. సి. అట్లూరి, శ్రీనివాస్ గుత్తికొండ, డా. వెంకట్ ఆలపాటి, మురళీ మేడిచెర్ల, ఆనంద్ కూచిభొట్ల, మైత్రేయి ఎడ్లపల్లిలకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్‌లను, కే.ఎస్. లక్షణరావు (M.L.C), వీరమ్మ మాదల, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఉత్తమ సేవా పురస్కారాలను కూడా అందించింది.
నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల కన్వీనర్ రాజేంద్ర మాదాల అభినందించారు. సమిష్టి కృషి వల్లే వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో నాట్స్ నాయకులు, వాలంటీర్లు చక్కటి సమన్వయంతో పనిచేశారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రశంసించారు. డల్లాస్‌లో నాట్స్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగు ప్రజలు, స్పాన్సర్స్ ఆ కార్యక్రమాలకు ఇస్తున్న మద్దతు, ఆదరణ మరువలేనిదన్నారు. డల్లాస్ నాట్స్ తెలుగు వేడుకలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.