మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (20:01 IST)

కార్తీక పౌర్ణమి.. కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే.. భార్యాభర్తల అనుబంధం..?

Lord shiva
మాసముల్లో కార్తీకం శ్రేష్ఠం. చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా భావించబడుతుంది. ఈనాడు కైలాస నాథుడు త్రిపురాసురుడిని సంహరించాడు. శంకరుని కీర్తిని నారదుని వల్ల విన్న త్రిపురాసురుడు శివుడంటే అసూయ చెంది, కైలాస పర్వతం మీదకు దండెత్తి వెళ్ళి, శంకరుడిని యుద్ధానికి రమ్మంటాడు.
 
మూడు రోజుల తీవ్ర యుద్ధానంతరం పరమ శివుడు, త్రిపురాసురుడిని సంహరించాడు. దేవతలు అభయంకరుడైన శంకరుడిని స్తోత్రం చేశారు. వెయ్యేళ్ళ అసుర పాలన అంతరించిన శుభ సందర్భాన శివుడు తాండవం చేశాడని పురాణ కథనం. ఈ దినాన దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్ని హరించుకు పోతాయని విశ్వాసం. రోజంతా ఉపవాసం ఉండి, రోజుకొక వత్తి చొప్పున 365 వత్తులను కూడిన దీపాన్ని వెలిగిస్తారు. 
Deepam
 
కొందరు దీపాలను నదిలో లేదా చెరువులో వదులుతారు. ఇళ్ళల్లో తులసి కోట వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాటి శివాలయంలో దీపారాధన ముక్కోటి దేవతల పూజ, సకల పుణ్య నదుల స్నాన ఫలం దక్కి, ఇహ పరలోక సుఖసౌఖ్యాలు, ముక్తి లభించగలవని నమ్మకం. 
 
ఈ రోజున కేదాశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్ళను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా పెట్టి, పూజలు చేయడం ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. 
 
కార్తీక శుద్ధ పూర్ణిమ రోజున కృత్తికా దీపోత్సవమును ఆచరించడం, ఉసిరిచెట్టుకు ప్రదక్షిణలు గావించి, కార్తీక దామోదరుని పూజ, దీపారాధన గావించుట అత్యంత పుణ్యప్రదమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
బలి చక్రవర్తికి ఒళ్ళంతా మంటలు పుడితే, కార్తీక పౌర్ణమి నాడు శివారాధన చేస్తే, మంటలు తగ్గినట్లు, మహిషాసురుడితో యుద్ధం చేసిన సమయాన శివలింగాన్ని బద్దలు కొట్టిన పాప నివృత్తికై పార్వతీదేవి కూడా శివారాధన చేసినట్లు పురాణ కథనాలున్నాయి.