శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (19:52 IST)

మహాలయ అమావాస్య: అన్నదానం తప్పక చేయాలట.. కర్ణుడు అలా చేయడంతోనే?

భాద్రపద మాసంలో పౌర్ణమితో ప్రారంభమయిన పితృపక్షం అదే మాసం చివరిరోజుల్లో అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యనే మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు. 2019 సంవత్సరంలో మహాలయ అమావాస్య సెప్టెంబరు 28 శనివారం నాడు వచ్చింది. పితృపక్షంలో పితృదేవతలు భగవాన్‌ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమిపైకి వస్తారు. వీరిని సంతృప్తి చేసేందుకు తర్పణం వదలాలి. కేవలం తర్పణమే కాదు అన్నదానం కూడా చేయాలి. కనీసం ఒక్క పేదవానికయినా అన్నదానం చేయాలని పురాణాలు చెప్తున్నాయి. 
 
అన్నదానం కేవలం మానవులకే కాకుండా జంతుజాలానికి కూడా చేయాలని.. కాకికి, ఆవులకు అన్నం సమర్పించాలని పండితులు చెప్తున్నారు. ''లోకానం నరజన్మం దుర్లభం'' అంటారు శంకర భగవత్పాదులు. ఎన్నో వేల జన్మలకు గానీ నరజన్మ ప్రాప్తించదు. అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకుని ప్రార్థించాలి.
 
అందుకే పితృపక్షంలో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలి. సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుందని పండితులు చెప్తున్నారు. ఇలా మహాలయ అమావాస్య రోజునే, భాద్రపద బహుళ పాడ్యమినాడు దానశీలి కర్ణుడు అన్నసంతర్పణ, పితరులకు తర్పణలు ఇవ్వడం ద్వారా స్వర్గానికి చేరుకున్నాడు. ఆ కథేంటో చూద్దాం.. 
 
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. 
 
దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ''కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది" అని ఆకాశవాణి చెప్పడంతో కర్ణుడు.. సూర్యదేవుడు, ఇంద్రదేవుని వరంతో భూలోకానికి వెళ్తాడు. అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి వచ్చాడు. 
 
అలా ఇంద్ర, సూర్యదేవుల సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.