ఏకాదశి వ్రతం లాగానే శివరాత్రి వ్రతం కూడా...? ఉపవాసం, జాగరణ (Video)

Lord shiva
Lord shiva
సెల్వి| Last Updated: బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (15:01 IST)
ఏకాదశి వ్రతం లాగానే శివరాత్రి వ్రతం కూడా చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి లాగానే శివరాత్రి కూడా త్రయోదశి నాటి నుంచే మొదలవుతుంది. త్రయోదశినాడు ఒంటిపూట భోజనం చేయాలనీ, మర్నాడు శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.


ఇక శివరాత్రి రోజంతా ఉపవాసం చేయాలి. శివరాత్రినాటి జాగరణతోనే ఆ ఉపవాసం పరిపూర్ణం అవుతుంది. జాగరణ అంటే కబుర్లతో కాలక్షేపం చేయడమో, సినిమాలు చూడటమో కాదు. శివనామస్మరణతో, శివధ్యానంతో మనసుని ఆయనయందు లయం చేయడమే జాగరణ లక్ష్యం.

శివరాత్రి రోజున జాగరణే కాదు... ఆ రాత్రివేళ ఆయనకు అభిషేకం చేస్తే మరింత ఫలం చేకూరుతుంది. అభిషేక ప్రియుడైన శివునికి శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి.

ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసిదళాలతో పూజ, మూడో జాములో నేయితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి.

శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివరాత్రినాడే కాబట్టి, శివరాత్రి రోజున శివాలయాలలో జరిగే పార్వతీకళ్యాణాన్ని దర్శించడం కూడా విశేష ఫలితాన్ని అందిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

దీనిపై మరింత చదవండి :