శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:07 IST)

హనుమంత సేవ.. శ్రీరాముని అవతారంలో మలయప్ప.. దర్శించుకుంటే? (video)

Hanumantha vahanam
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.. తొమ్మిదిరోజుల పాటు అత్యంత శోభాయమానంగా జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు ముక్కోటిదేవతలు ఒక్కటై తిరుమలకు వస్తారట. ఈ క్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.  
 
అలా హనుమంతుడి వాహనంపై ఊరేగే స్వామిని.. ఆంజనేయుణ్ని దర్శించడం ద్వారా భక్తిపై ఏకాగ్రత కలగడమే కాక.. భయం, బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హనుమంతుడు శ్రీరాముని నమ్మిన బంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ... ఆ బంటుకు మళ్లీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యమే ఇదని పురోహితులు చెప్తుంటారు. 
 
అలాగే గురువారం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.
 
ఇంకా గురువారం వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ పరమార్థం. ఆరో రోజు సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి బంగారు రథంపై ఊరేగుతారు.
 
అనంతరం వేంకటేశ్వరస్వామిన చతురంగ బలాలతో గజనవాహనంపై విహరిస్తారు. శ్రీవారి సార్వభౌమత్వానికి ప్రతీకకగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చాటుకునే రీతిలో రజత కంతుల మధ్య గజ వాహనసేవ జరుగుతుంది. ఈ వాహన సేవలో పాల్గొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం.