సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (22:39 IST)

పరమేశ్వరుడిని పూజించేందుకు చితాభస్మం కావాలని అలా వెళ్లిపోయారు

ప్రతి ఒక్కరూ మనసులో ఏదో ఒక కోరికతో దేవాలయాలకు వెళ్ళి తన మనసులో ఉన్న కోరికను దేవునికి విన్నవించుకొని ఆ కోరిక తీరితే ఉపవాసము ఉంటామని, కొబ్బరికాయలు కొడతామని, అనేక రకాలైన మ్రొక్కులు, మ్రొక్కుతాము. మనము సరిగా ఆలోచిస్తే మన మ్రొక్కులు ఆయనకు అవసరం లేదు. కాని పరమాత్మ మన అందరిని తమ బిడ్డలలా భావించి మన కోర్కెలు తీరుస్తారు. కాని కొందరు భక్తులు స్వామిని ప్రేమతో ధ్యానించి జీవన్ముక్తులు అవుతారు.
 
ఇలా జీవన్ముక్తులు అయిన ఒక జంట గురించి మనం తెలుసుకుందాం. మలయాద్రి ఎత్తయిన కొండ. దాని చట్టూ దట్టంగా అడవి అల్లుకొని ఉంది. ఆ అడవిలో బోయపల్లె అనే ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ప్రజలకు అడవే జీవితం. అక్కడ ప్రజలు చిన్నచితకా జంతువులను వేటాడి చంపటం వీరి వృత్తి, ప్రవృత్తి. ఆ జంతువుల మాంసమే ప్రధానంగా వాళ్ళ ఆహారం.
 
దాంతో పాటు చుట్టుప్రక్కల దొరికే కందమూలాలు, రకరకాల పళ్ళూ,కాయలు తెచ్చుకుని తింటారు. ఆ పల్లెలో చండకుడు, పుళింది అనే ఒక చక్కనైన జంట. చండకుడు రోజూ వేటకు వెళ్ళేవాడు. కాని ఒకరోజు చండకుడు గుడిసె ముందు నేల మీద వెల్లికలా పడుకొని ఆకాశం వంక తదేకంగా చూస్తూ మధ్యమధ్యలో కూనిరాగాలు తీస్తున్నాడు. ఏందిరా ఇయ్యాల వేటకు ఎల్లవా... బాగా సోంబేరివై పోనావురా, పిచ్చినా మగడా ఈ పడుకోటమేందీ ఈ కూని రాగాలు తీయడమేందీ?
 
మగవాళ్ళందరూ యాటకు పోడం చూళ్ళేదూ.. అని బుద్దులు చెప్పటం ఆరంభించింది పుళింది. అది విన్న చండకుడు లేచి కూర్చుని ఇక సాల్లే ఆపవే సోది. ఈ రోజు నుంచి నేను వేటకు ఎల్లనుగాక ఎల్లను.. నువ్వు నేను మాంసము ముట్టేదే లేదు. మన ఆకలి కోసం జీవులను చంపాలా కందమూలాలు, పండ్లు తింటే సరిపోతుంది. అది సరేగాని నాకు ఒక దిగులు పట్టుకుందే.. నీకు దిగులా ఎందుకయ్యా అంటూ దగ్గర కూర్చుంది. దిగులెందుకో సెప్పవయ్యా అంది పుళింది.
 
కాసేపు చండకుడు మౌనంగా కూర్చోని ఇలా అన్నాడు. పోయిన అమాసరోజు యాట కోసం ఎల్లాను గదా దేన్ని చూసినా చంపాలని లేదు అలా అడని అంతా తిరుగుతూ కాలం గడిపాను. పొద్దువాలిపోయింది, కడుపు లిపోతుంది, ఒళ్ళు తూలిపోతున్నది చేసేది లేక చట్లమద్య కూలబడ్డాను. అప్పుడు ఆ చెట్ల మద్య నుంచి ఒక కోవెల అగుపించింది. మెల్లగా లేచి ఆ కోవెల దగ్గరకు చేరుకున్నాను. ఆ కోవెలంతా బూజు, దుమ్ము గోడలన్ని పగుళ్ళు చుట్టూ పిచ్చిమొక్కలు. ఆ కోవెల కూలిపోద్దెమో అన్నభయం, సామికి తిండి పెట్టే దిక్కేలేదు.
 
ఓ అదా నీ దిగులు అంది పుళింది. ఇంతకి ఆ కోవెలలో ఉన్న సామి ఎవరూ. శివలింగం..... కుదిమట్టంగా ఉంది అన్నాడు చండకుడు. సివయ్యా... అంటూ దణ్ణం పెట్టుకుంది పుళింది. అయినా నీ పిచ్చిగాని మనమేం సెయ్యగలం అంది పుళింది... ఎందుకు సెయ్యలేం సెయ్యగలం సివయ్యకి సెయ్యగలం అని దృఢంగా చెప్పాడు చండకుడు. ఎట్టా సెయ్యాలో ఆలోచించి అది సెప్పు అన్నాడు చండకుడు. కాసేపు తల గోక్కుంది. దిక్కులు వంక చూసింది.
 
ఒకమాట నీకు సినరాజుగారు ఎరకేగ ఒకసారి యాటకు వస్తే పులి చంపబోతే మీరు ధైర్యంగా కాపాడారు కదా.. అవును.. అవును అన్నాడు చండకుడు. రేపే వెళ్ళి సినరాజును కలువు. మర్నాడు ఉదయమే బయల్దేరి రాజధానికి చేరుకున్నాడు. ఎంతో కష్టపడి యువరాజు సింహకేతుడును కలుసుకున్నాడు చండకుడు. అడవిలో అతీగతీ లేకుండా పడున్నా శివాలయం గురించి అతడు యువరాజుకి చెప్పాడు.
 
ఎప్పుడో ఒకప్పుడు అది కూలిపోతుందని ... దానిని బాగుచేయించాలని వేడుకున్నాడు. అప్పుడు యువరాజు ఇలా అన్నాడు, చండకా నేను వేటకి అడవిలోకి వచ్చినప్పుడల్లా నేను శివాలయాన్ని చూస్తూనే ఉన్నాను. కానీ ఏంచెయ్యను. అడవి లోకి వచ్చి పూజ చేయానికి ఏ బ్రాహ్మణుడూ ముందుకు రావటం లేదు. నేనూ శివభక్తుడునే సుమా. చండకుడు యువరాజును ప్రాధేయపడ్డాడు. యువరాజు మంత్రులతో చర్చించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు.
 
చండకా.. నేను గుడిని వెంటనే బాగుచేయిస్తాను. కాని అక్కడ పూజ నువ్వు చేయాలి. నేనా పూజ చెయ్యాలా.. అవును నువ్వే భయపడవద్దు. నేను నీకు పూజ చేసే విధానం చెపుతాను. రోజు రెండు పూటలా స్నానం చేసి విభూదిని పెట్టుకో, శివభక్తులకు విభూది సంపద. అందువల్లనే భస్మ ధారణ రోజు చేయ్యాలి. నేను నీకు భస్మాన్ని పంపుతాను. నీ నుదుట మీద, భుజాల మీద, రొమ్ము మీద విబూది పుండ్రల్ని అడ్డంగా ధరించు.
 
శివలింగం మీద మారేడు దళాల్ని, తుమ్మి పూలని ఉంచి, పళ్ళను నైవేద్యంగా సమర్పించు. ఏకాగ్రమయిన మనస్సుతో స్వామిని ధ్యానించు అని వివరంగా చెప్పాడు సింహకేతువు. వెంటనే చండికుడు తన పల్లెకి తిరిగివచ్చాడు. రెండు రోజుల్లోనే పనులు ప్రారంభించారు. త్వరత్వరగానే ఆలయ నిర్మాణాన్ని పూర్త చేసారు. ఉదయం సాయంత్రం రెండుపూటలా భార్యాభర్తలు వెళ్ళి శుచిగా భక్తితో పూజలు చేస్తున్నారు.
 
పల్లెలోని మిగిలిన బోయల్లో కూడా భక్తిభావం పెరిగింది. మహాశివ రాత్రి పర్వాన ఉదయం నుంచి ఉరుములూ, మెరుపులతో పెద్దగాలి వాన.. బోయపల్లె అంతా జలమయమయింది. చరకుడు పుళింది మాత్రం శుచిగా స్నానం చేసి వానలో తడుస్తూ గుడికి వెళ్ళారు. విభూది నిండుకుంది భస్మధారణ చెయ్యకుండా పూజ కుదరదు కదా. రాజధాని నుంచి యువరాజు విభూది పంపలేదు. నేనేం చెయ్యాలి అని భాదపడ్డాడు. అది చూచిన భార్యకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
చండకుడు తదేకంగా చూస్తూ... చితాభస్మం అంటే ఏమిటో తెలుసా.. కాటిలో బూడిద. శివయ్య వంటి నిండా పూసుకునేది అదే. ఆ బూడిదంటే శివయ్యకి చాల ఇష్టం అని చెప్పాడు.
 
వానా కాలంలో ఇబ్బంది లేకుండా ముందుచూపుతో ఎండిన చితకులు.. కట్టెలు మండపంలో దాచి పెట్టింది. ఆ కట్టెలతో నేను కాలి బూడిద అవుతాను. ఆ బూడిదతో శివయ్యకు అభిషేకం చెయ్యి అంది పుళింది. నువ్వు లేకుండా నేను ఉండలేను అలా మాట్లాడకు అని ఏడుస్తూ అన్నాడు చండకుడు. గుండె రాయి చేసుకో వేరే దారిలేదు. శివయ్య సేవకు నన్ను అంకితం కానివ్వు అని వేడుకుంది.
 
చెప్పగా చెప్పగా చివరకు ఒప్పుకున్నాడు. మండపంలో ఒక ప్రక్క కట్టెల చితుకుల్ని పేర్చుకుంది. ఆ చితిపై పడుకుని నిప్పు అంటించుకున్నది. క్రమంగా కాలి బూడిద అయ్యింది. పైకి తన్నుకొస్తున్నా దుఃఖాన్ని ఆపుకుని ఆ చితా భస్మాన్ని నుదుట ధరించాడు. ఆ తరువాత భస్మంతో హరహర మహాదేవ.. అంటూ శివలింగానికి అభిషేకం చేశాడు. పుళింది శివయ్యకి అభిషేకం అయిపోయందిరా అని భార్యను పిలిచాడు. భార్య మరణించిన విషయాన్ని మరిచి పిలిచాడు.
 
నేను ఈడనే ఉన్నా నువ్వురా మగడా అని బూడిదలో నవ్వుతూ పిలిచింది. వత్తున్నా వత్తున్నా అంటూ ముందుకు పడిపోయాడు. అతని ఆత్మజ్యోతి పుళిందిని చేరింది. రెండు ఆత్మలూ ఒక్కటై శివలింగంలో లీనమయ్యాయి.