శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (21:31 IST)

భర్త ఆగ్రహానికి ఆమె బూడిదయ్యింది, అలా అరటి వృక్షం వచ్చింది... (video)

తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము, తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! ఈ పద్య భావము.. ఎవరికైననూ తన కోపమే తనకు శత్రువవుతుంది. తన శాంతమే తనకు రక్షణగా నిలుస్తుంది. తను చూపే దయాగుణమే బంధువులవలె సహకరిస్తుంది. తన సంతోషంగా వుండగలిగితే అది స్వర్గంతో సమానము. తను ధుఃఖమును చేతులారా తెచ్చుకొన్నట్లయితే అదే నరకవడం తథ్యము.
 
అలాంటిదే దుర్వాస మహర్షికి ఎదురైంది. దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. తన భార్య అయిన కదళితో ఒక పర్ణశాలలో నివశిస్తూ, జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. భర్త కోపిష్టి అని తెలిసిన కదళి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురికాకుండా ఉంటుండేది. ఈ క్రమంలో ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు.
 
వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆయన అర్ధాంగి అయిన కదళి ఎంతోసేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి, సాయంసంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో ఆయనను నిద్ర లేపుతుంది. భార్య కదళి నిద్రాభంగం కలిగించినందున పరమకోపిష్టి అయిన దుర్వాస మహర్షి పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరచి భార్యను చూచాడు. ఆ సమయంలో ఆయన నేత్రాల నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు ఆమె భస్మమైపోయింది.
 
తను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడు పశ్చాత్తపపడ్డాడు. ఐతే కొన్నిరోజుల తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. తనకుమార్తె ఎక్కడ అని దుర్వాసుని మామగారు అడిగాడు. మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరాడు. ఆ తర్వాత తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదళీ వృక్షం, అంటే అరటిచెట్టు.
 
దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె ‘కదళి' అందరికీ ఇష్టురాలై కదళీ ఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదనకే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ, నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడట. ఆ కదళీ ఫలాన్ని(అరటి పండును) మనం కడిగి దేవుని ముందుంచి కొద్దిగా తొక్క తీసి 'కదళీఫలం సమర్పయామి' అంటూ నివేదన చేస్తాం.