శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (16:20 IST)

మొట్టమొదట రాఖీ కట్టించుకున్న అన్న... కట్టిన చెల్లి ఎవరంటే…

శ్రావణ మాసం రాగానే అందరూ ఎదురుచూసే పండుగ రాఖీ. అన్నదమ్ములకు రాఖీ కట్టాలని అక్కచెల్లెళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. అలాగే అన్నదమ్ములు కూడా ఆ రక్షాబందన్ వేడుక కోసం కానుకలతో ఎదురుచూస్తారు. ఎంతో పవిత్రమైన

శ్రావణ మాసం రాగానే అందరూ ఎదురుచూసే పండుగ రాఖీ. అన్నదమ్ములకు రాఖీ కట్టాలని అక్కచెల్లెళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. అలాగే అన్నదమ్ములు కూడా ఆ రక్షాబందన్ వేడుక కోసం కానుకలతో ఎదురుచూస్తారు. ఎంతో పవిత్రమైన ఈ వేడుక ఈనాటి కాదు, దీని మూలం మహాభారతంలోనే ఉంది.
 
శ్రీకృష్ణునికి సృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే విక్రుతమైన పిల్లవాడు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు ఎవరి చేయి తగిలితే మామూలు రూపంలోకి వస్తాడో, అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెబుతారు. ఒకరోజు సృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో పిల్లవాడిని పెట్టగానే చక్కటి రూపంలోకి మారిపోతాడు. అది చూసి ఆ తల్లి ఆనందంతో మురిసిపోతుంది. కాని అంతలోనే ఆ పిల్లాడు కృష్ణుని చేతిలోనే మరణిస్తాడని  తెలిసి విచారిస్తుంది.
 
తన కొడుకుని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో క్షమించి వదిలేయమని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి నూరు తప్పులు వరకు అతనిని చంపనని వరము ఇస్తాడు. కాని వంద తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదని చెబుతాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై రాజ్యానికి రాజవుతాడు. కాని అనేక దుర్మార్గాలు చేస్తుంటాడు. రాజ్యంలో అందరిని పీడించడంతో పాటు, చీటికి మాటికి కృష్ణునితో గొడవ పడుతూ ఉంటాడు.
 
చివరికి ఒకరోజు వందవ తప్పు పూర్తి కాగానే, కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడుని హతమారుస్తాడు. కృష్ణుడు ఎంతో కోపంతో సుదర్శన చక్రం ప్రయోగించడంతో అతని వేలికు గాయం అయ్యి రక్తం కారుతుతుంది. ఆ వేలికి కట్టు కట్టేందుకు నాలుగు దిక్కులకు పరుగు తీసారు. కాని అక్కడే ఉన్న ద్రౌపతి వచ్చి ఆమె చీరకొంగు చించి, కృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి, నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా, నన్ను తలుచుకో నేను వెంటనే నిన్ను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు కృష్ణుడు ద్రౌపతికి. 
 
ఈ సంఘటనే రక్షా బంధనానికి నాందిగా నిలిచింది. తరవాత కాలంలో ద్రౌపతి చీరను లాగి అవమానించాలని కౌరవలు అనుకుంటే, అప్పుడు అన్నా అని పిలవగానే కృష్ణుడు వచ్చి ఆమెను ఆదుకుంటాడు. అప్పటి నుంచి ప్రతీ శ్రావణమాస పౌర్ణమి నాడు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు రాఖీ కట్టి మాకు రక్షగా ఉండమని కోరతారు. రాఖీ క‌ట్టి కంటికి రెప్పలా కాపాడతామని మాట ఇస్తారు అన్నదమ్ములు. ఇదీ రాఖీ వృత్తాంతం.