1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (15:02 IST)

గోవిందా అంటే అర్థం తెలుసా..!

గోవింద అనగానే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా.. అనే మాట ప్రతీ తెలుగువాడికి వెంటనే గుర్తుకువస్తుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణలతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటు

గోవింద అనగానే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా.. అనే మాట ప్రతీ తెలుగువాడికి వెంటనే గుర్తుకువస్తుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణలతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవిందా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులం నాటి కథ తెలుసుకోవాలి.
 
గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా, తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్థనగిరి తన చిటికెన వేలున ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు. అది చూసిన ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళతాడు.
 
అదేసమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని), కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటాడు. అప్పటి నుంచి అలా కృష్ణుడు, గోవిందుడు అన్న నామంతో పూజలందుకున్నాడు.