శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నంద్యాల విడిది ముగించుకుని, శిష్యులతోపాటు అహోబిలం చేరి కొద్ది దినములు ఉండి ఆ పుణ్యక్షేత్రమందు శ్రీ నరసింహస్వామివారిని దర్శించుకుని, సేవలు చేసారు. అహోబిలం క్షేత్రమును సంపూర్ణముగా దర్శింకున్న తరువాత అక్కడ నుండి బయలుదేరి అరణ్య మార్గము గుండా పయనిస్తూ, భోజనాదులకై ఒక వటవృక్షం క్రింద మకాం వేసారు. శిష్యులు వంట ఏర్పాట్లు చేస్తుండగా స్వామివారు, సిద్దయ్యను తీసుకుని సమీపమున ఉన్న జలాశయానికి స్నానమునకు వెళ్ళారు. ఈలోపల ఆకులు కోసి విస్తర్లు తయారుచెయ్యడానికి ఒక శిష్యుడు ఆ మహావృక్షమునెక్కాడు. మీద కెక్కిన తరువాత భయముతో కేకలు వేస్తూ క్రిoదపడిపోయి తెలివి కోల్పోయాడు. ఇది చూసి ఇంకొక శిష్యుడు చెట్టు ఎక్కాడు. అతను కూడా అరుస్తూ క్రింద పడి స్పృహ కోల్పోయాడు. అలా అక్కడ ఉన్న శిష్యులందరూ స్పృహ కోల్పోయారు.
స్వామివారు వచ్చి స్పృహ కోల్పోయి పడిఉన్న శిష్యులను చూసి, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని జరిగినది గ్రహించి, సిద్దయ్యనుద్దేశించి, శిష్యా! ఈ చెట్టుమీద బ్రహ్మ రాక్షసి నివాసమేర్పరుచుకొని, దారిన పోయే వారందరినీ భయపెడుతూ భుజిస్తూ ఉంది. ఈ బెత్తెము తీసుకుని చెట్టెక్కి, దానిని క్రిందకు తీసుకురా అని పలికారు.
సిద్ధయ్య వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆజ్ఞను తీసుకొని ఆ పెద్దచెట్టునెక్కగా, అతి సుందర రూపంతో ఉన్న సౌందర్యవతిగా రూపుదాల్చింది. ఆమె ఎన్ని హొయలు పోయినా, ఎన్ని మాయలు చేసినా చలించక, తన చేతినున్న బెత్తమునకు పనిచెప్పి ఆ రాక్షసిని క్రిందకు ఈడ్చుకు వచ్చాడు. క్రిందకు దిగినంతనే తన మాయ రూపమును వీడి స్వతఃసిద్ధమైన రాక్షస రూపమునుదాల్చి స్వామివారి పాదాలపైపడి,ప్రభూ, నన్ను మన్నించు, ఈ దుర్భర జన్మమునెత్తి అందరినీ భయపెడుతూ భుజిస్తూ ఆకలి తీర్చుకోవడం నాకు కూడా ఇష్టముగా లేదు, కానీ ఆకలికి తాళలేక ఈ మార్గమున వచ్చు వారిని భక్షిస్తున్నాను.
నన్ను క్షమించి ఈ జన్మ నుండి విముక్తి కల్గించు స్వామీ అని వేడుకుంది. అంతట స్వామివారు, ఓసీ! ప్రాణము మీదకు వచ్చేసరికి వైరాగ్యము పుట్టుకు వచ్చిందా, నీవు చేసిన పాపములకు గాను ఇదే రూపమున ఇంకొన్నాళ్ళు ఉండి నికృష్ట జీవితమే గడుపుతూ ఇంకా కొన్నాళ్ళు ఉండి ఖర్మ ఫలమును అనుభవించక తప్పదు. అయితే కొంతకాలం తరువాత ఇదే మార్గము గుండా ఈశ్వరీదేవి అను పుణ్యాత్మురాలు పయనిస్తుంది. ఆమెని ప్రార్ధించి శాపవిమోచనం పొందుము. అంతవరకూ నీకు ఆకలి లేకుండా చేస్తాను అని చెప్పి విభూతిని ఆ రాక్షసి నోట్లో వేసి ఆకలి లేకుండా చేసారు. తెలివి కోల్పొయి పడిఉన్న శిష్యులపై విభూతి జల్లి అందరికీ తెలివి వచ్చేటట్లు చేసారు.
కడప నవాబుకు మహిమను చూపుట
అహోబిల క్షేత్రం నుండి బయలుదేరిన స్వాములవారు, మార్గమద్యమున బ్రహ్మ రాక్షసి మదమణచి, మద్యమద్యలో చెంతకు వచ్చిన భక్తులకు జ్ఞానభోద చేస్తూ, కడపకు చేరుకున్నారు. స్వామివారు కడప ప్రవేశిస్తుండగా, నవాబు సాహెబు ఎదురు వచ్చి భేరిమృదంగాది విజయదుందుభుల మధ్య ఊరేగింపుగా రంగమహలుకు తీసుకొనిపోయి ఉచితాసనముపై ఆశీనులను చేసి, తగురీతిన సత్కరించి, యతీశ్వరా! మీ రాక వల్ల మా నగరము పావనమయినది. ఇక్కడ మీకు, మీ శిష్యులకు అన్ని ఏర్పాట్లూ చేసాను. నచ్చినన్ని రోజులు మా అతిధులుగా ఇక్కడ ఉండి, తమరి కార్యక్రమములు నిరాటంకంగా నిర్వర్తించుకొనవచ్చు అని చెప్పి కించిత్ తన కోర్కెను వెల్లడించాలా వద్దా అని మీమాంశతో తటపటాయిస్తూ కదలక నిలబడ్డాడు. విషయం గ్రహించిన స్వామివారు, నీ అంతరంగమును గ్రహించాము. నీ కోర్కెను తప్పక తీరుస్తాను అని అభయమిచ్చారు. తన కోర్కెను బయటపెట్టకుండానే గ్రహించిన స్వామివారి మహిమ ఊహాతీతమని భావించి, నవాబు స్వామివారిని సభకు ఆహ్వానించాడు.
వీరబ్రహ్మేంద్ర స్వామివారి అనుమతిని తీసుకొని, సభకు పుర ప్రముఖులతోపాటు, ప్రజలందరూ హాజరు కావాలని శ్రీముఖము జారీ చేసాడు. అనంతరము స్వామివారిని పల్లకిలో బాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకొనిపోయి నిండు సభలో ఉన్నతాసనముపై కూర్చో బెట్టాడు. స్వామివారు ఆసనమును అధిరోహించి, అందరి వద్దా ప్రణామములు గ్రహించి, నవాబు వైపు తిరిగి, నాయనా నీ కోర్కెను నీ నోటితోనే. సభా ముఖముగా తెలియజేయు అనగా, నవాబు మాది చిన్న కోర్కె స్వామీ! మమ్ము మన్నించి మా కోర్కెను గ్రహించి, తీర్చుటకు ఒప్పుకున్నందుకు ధన్యుడ్ని.
మీ మహిమను తెలుసుకుని ప్రజలు ధన్యులగుదురు. మా అశ్వ శాలలో ఒక చూడు గుర్రమున్నది. దానికి పుట్టబోయేది మగ గుర్రుమో, ఆడ గుర్రమో తెలుసుకోవాలని కోరికగా ఉన్నది స్వామి అన్నాడు. ఆ అశ్వమును సభలోనికి ప్రవేశపెట్టించు నాయనా అని స్వామివారు చెప్పడంతో, ఒక గుర్రమును తీసుకు రాగా, కాళ్ళు నాలుగూ తెల్లగా ఉండి, ముఖముపై బొడ్డువంటి మచ్చతొ మగ గుర్రము జన్మించును అని సెలవిచ్చారు. అంతట నవాబు, ఈ గుర్రము మరి రెండు నెలలకు గాని ఈనదు. మగ జీవియే పుట్టుచున్నది అని ఎలా నిర్థారించగలం స్వామీ అని సందేహం వెలిబుచ్చాడు.
వీరబ్రహ్మేంద్రస్వామివారు చిరు హాసము చేస్తూ, గుర్రము చుట్టూ తెరకట్టించి, లోపలకు వెళ్లి, కొంత తడవ తరువాత, ఒక గుర్రపు పిల్లతో బయటకు వచ్చారు. అది తెల్లని కాళ్ళు, మొఖము మీద మచ్చ ఉన్న మగ గుర్రపు పిల్ల. సభాసదులందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనై కరతాళధ్వనులతో, జయజయ ధ్వానాలతో స్వామివారి మహిమను శ్లాఘించారు. మీ మహిమలు విని యున్నా, సందేహము వెలిబుచ్చినందుకు క్షమించడి స్వామీ అని పలుకగా, మూఢముగా నమ్మక తర్క వితర్కములతో సత్యమును శోధించుటలో తప్పులేదని నుడివి మరల పిల్లగుర్రముతో సహా తెర లోనికి వెల్లి కొంతసేపటి తరువాత తెరతీయించగా, చూలుతో గుర్రము యధాతధముగా నిలుచొని ఉన్నది. పిదప స్వామి వారు సభలో భక్తి తత్వముతోపాటు కాలజ్ఞానాన్ని వినిపించారు. (ఇంకా వుంది)
- కొమ్మోజు వెంకటరాజు