చేవెళ్ల శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం...
శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో లీలను ఆవిష్కరిస్తూ, భక్తుల కోరికలు నెరవేరుస్తుంటారు. అలా అశేష భక్త జనులను ఆకర్షిస్తోన్న క్షేత్రంగా రంగార
శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో లీలను ఆవిష్కరిస్తూ, భక్తుల కోరికలు నెరవేరుస్తుంటారు. అలా అశేష భక్త జనులను ఆకర్షిస్తోన్న క్షేత్రంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దర్శనమిస్తుంది. ఇక్కడి గుట్టపై గల శ్రీనివాసుడిని దర్శించుకుంటే ఆయన మహిమలు అందరికీ తెలుస్తాయి.
క్రీ.శ.13 వ శతాబ్దంలో ఒక భక్తుడు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత చాలాకాలంపాటు స్వామివారికి నిత్య ధూప, దీప, నైవేద్యాలు జరుగతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆలయం శిధిలావస్థకు చేరుకోగా మరో భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు. ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతం జరిగింది. ఓ రైతు పొలాన్ని దున్నుతూ బరువు కోసం ఆ పొలం గట్టున ఉన్న రాయిని నాగలిపై ఉంచాడు.
పొద్దు పోయేవరకూ పొలాన్ని కొంతవరకు దున్ని ఆ నాగలిని, రాయిని అలాగే వదలి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి పొలం దగ్గరకి వచ్చిన ఆ వ్యక్తికి ఆ బండరాయి నాగలి దగ్గర కాకుండా పొలం గట్టుపై యథాస్థానంలో కనిపించింది. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఆ రాయిని తెచ్చి మళ్ళీ నాగలిపై పెట్టాడు.
కానీ ఆ రాయి వెంటనే దానంతట అదే జరుగుతూ వెళ్లి పొలం గట్టుపై యథాస్థానంలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అది దైవ మహిమగా భావించి అక్కడికి తరలి వచ్చి పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. కానీ ఆ శిలను ఏ దైవంగా భావించాలనే విషయం వాళ్లకు అర్థం కావట్లేదు. ఆ శిల తన సాలగ్రామ రూపమని, తనని ఆ పొలం గట్టుపై నుండి తీసుకువెళ్లి ఆ ఊళ్లోని ఆలయంలో ప్రతిష్టించమని ఆ రాత్రి శ్రీనివాసుడు పూజారి కలలో చెప్పారు.
మరునాడు ఉదయం తనకి వచ్చిన కలను గురించి ఆయన గ్రామస్తులకు తెలియజేశాడు. ఇక గ్రామ ప్రజలందరు కలిసి ఆ శిలా రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ సంఘటన కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది.