మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 28 మార్చి 2016 (18:05 IST)

తిరుమల భద్రత... గోవిందా... భక్తుల రక్షణ గాల్లో దీపమేనా?

ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ముష్కరుల దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. రక్తపాతాన్ని కళ్ల చూడందే ఉగ్రవాదులకు రోజు గడవడం లేదు. ఇక ఈ విషయంలో మన దేశంపై మరింత గురి ఉంటుంది. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రం ఉగ్రవాదుల లిస్టులో ఉంటుంది. ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమలను టార్గెట్ చేయడం ద్వారా అపార నష్టం కలిగించవచ్చన్నది వారి ప్లానింగ్. దీంతో ప్రతిక్షణం నిఘా నీడలో తిరుమల క్షేత్రం ఉండాలి. కానీ అక్కడ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. 
 
కనీసం సాధారణ తనిఖీలు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. టీటీడీకి ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికి నిషేధిత వస్తువులు  ఎప్పటికప్పుడు కొండకు చేరుతూనే ఉన్నాయి. మద్యం, మాంసం, సిగరెట్లు, తిరుమల కొండ మీదకు తీసుకుని రావడానికి వీలులేదు. కానీ తిరుమలలో అవి విచ్చల విడిగా దొరుకుతున్నాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు అలిపిరి చెక్ పోస్టులో తనిఖీలు ఏవిధంగా నిర్వహిస్తారో చెప్పడానికి.
 
ఇక ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే ఎదుర్కొనే శక్తి టీటీడీ విజిలెన్స్‌కు ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత కొన్ని నెలల క్రితం తిరుపతికి అతి సమీపంలోని పుత్తూరులో ఉగ్రవాదులు మాటువేసి బాంబులు పేల్చేందుకు ప్రయత్నాలు కూడాచేశారు. అయితే అప్పట్లో ఆ విషయం చర్చనీయాంశంగా మారినా టిటిడి నిఘా, విజిలెన్స్ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదు. టిటిడి నిఘా, విజిలెన్స్ అధికారులు ఎప్పుడు తిరుమలలో సేవా టికెట్లను విక్రయించడమే పనిగా పెట్టుకుంటారన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
తిరుమలలో ప్రతినిత్యం ఇదే పరిస్థితి కనిపిస్తోందని భక్తులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సేవా టికెట్లను పొందాలన్న ఆసక్తి విధుల్లో మాత్రం విజిలెన్స్, నిఘా అధికారులు చూపించడం లేదనేది ఎప్పటి నుంచో వస్తున్న విమర్శలు. మరో తాజా ఉదాహరణ గత రెండునెలల క్రితం ఒక ఉగ్రవాది తిరుమలకు వచ్చి రెక్కీ నిర్వహించడం వెళ్ళినా పట్టుకోలేదంటే ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
తిరుమల నాలుగు మాడ వీధుల్లో చిన్న గుడారాల్లా ఏర్పాటు చేసుకుని భద్రతను నిర్వహిస్తున్న పోలీసులు తప్ప మిగిలిన ఎవరూ కూడా సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. మరోవైపు టిటిడి విజిలెన్స్‌, నిఘాను ఎప్పటికప్పుడు పట్టించుకోవాల్సిన టిటిడి ఉన్నతాధికారులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండడంతో వీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏపీ డీజీపీ రాముడు స్వయంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమలకు త్రెట్‌ ఉందని మీడియా సమావేశంలో తెలిపి వెళ్లిపోయారు. 
 
స్వయంగా పోలీస్‌ బాస్‌ ఈ విషయాన్ని తెలిసినా సిబ్బందిలో మాత్రం ఏ మాత్రం చలనం లేదు. ప్రతిరోజు 50వేల మందికిపైగా భక్తులతో కిటకిటలాడే తిరుమలకు వచ్చే భక్తుల ప్రాణాలు గాలిలో దీపమనే చెప్పాలి. భద్రత కోసం నియమించిన ఈ సెక్యూరిటీ అధికారులు కాస్త తమ స్వార్థం చూసుకుంటుండడంతో ఈ పరిస్థితి తలెత్తుత్తోంది. ఇప్పటికైనా నిఘా, విజిలెన్స్ అధికారులు నిద్ర మత్తు వదిలి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుకుంటున్నారు.