అతి పురాతనమైన ముండేశ్వరి ఆలయం గురించి తెలుసా? (Video)
ప్రపంచంలో పురాతన దేవాలయాలు, కట్టడాలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. వాటిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. అలాంటి అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి బీహార్‌లో కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలో ఉన్న ముండేశ్వరీ ఆలయం. ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైనదని చరిత్రకారుల అంచనా.
మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన అమ్మవారి ఆలయం.
భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొనవచ్చు. క్రీ.శ. 105లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద ఉంటుంది. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది.
ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ చేస్తూ మహిషాసురమర్ధిని రూపంలో ఉంటుంది. ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో ఉంటాడు. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా ఉన్నాయి.
చైత్ర మాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. పురావస్తుశాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల 9 విగ్రహాలను కోల్‌కత్తా సంగ్రహాలయానికి తరలించారు. వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. ఈ ఆలయాన్ని తాంత్రికపూజలకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి.
అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అటుపై పూజారి మంత్రించిన అక్షింతలను మేకపై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహతప్పి పడిపోతుంది. అటుపై మరోసారి పూజారి అక్షింతలను మేకపై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.