1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By డీవీ
Last Updated : గురువారం, 26 మే 2022 (18:47 IST)

ఒడిశాలో శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవం

YV Subbareddy, Swaroopanandendra, Swatmanandendra Swamy, and others
YV Subbareddy, Swaroopanandendra, Swatmanandendra Swamy, and others
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల చేతులమీదుగా ఉద్ఘాటన జరిగింది. గురువారం ఉదయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆలయాన్ని ప్రారంభించారు. 
 
YV Subbareddy, Swaroopanandendra, Swatmanandendra Swamy, and others
YV Subbareddy, Swaroopanandendra, Swatmanandendra Swamy, and others
మహా సంప్రోక్షణ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారత ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలన్న టీటీడీ సదుద్దేశాన్ని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకోవడం ముదావహమని తెలిపారు. 
 
యావత్ ప్రపంచానికే వేంకటేశ్వర స్వామి ఆదిపురుషుడని అన్నారు. భారతావనిలో వేదాలను పోషిస్తూ, గో సేవ చేస్తున్న ఏకైక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అని కొనియాడారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిత్యం శ్రీవారి కల్యాణాలను నిర్వహించే సంస్థ కూడా టీటీడీయేనని అన్నారు. ఏ మతంలోనూ లేని అద్భుతమైన, శక్తివంతమైన క్షేత్రంగా టీటీడీని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు.