జ్వర లక్షణాలుంటే కొండపైకి అనుమతి నిరాకరణ... తితిదే
సాధారణం కంటే శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నా... జ్వరంతో బాధపడుతున్నా తిరుమల కొండపైకి అనుమతి కష్టమే. ఇలాంటివారిని గుర్తించేందుకు థర్మల్ గన్‌లను తితిదే అందుబాటులో ఉంచింది. వీటితో ప్రతి భక్తుడుని పరిశీలించి, ఆ తర్వాత కొండపైకి అనుమతిస్తారు.
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల కొండపైకి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే ఈ కొండపైకి కరోనా వైరస్ వ్యాపించకుండా తితిదే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో థర్మల్ గన్‌లను అందుబాటులో ఉంచింది. శుక్రవారం నుంచి కొండపైకి ఎక్కే ప్రతి ఒక్కరినీ ఈ గన్‌తో పరీక్షిస్తారు. శరీరంలో జ్వర లక్షణాలు కనిపించకపోతేనే వారిని కొండపైకి అనుమతిస్తారు.
ఒకవేళ సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే, పక్కనే ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటరులో తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ జ్వర లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయితే, అలాంటి వారిని వెనక్కి కొండపైకి అనుమతించరు.
కాగా, తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి దర్శనం పూర్తయ్యేందుకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 3 గంటల సమయంపడుతోందని తెలిపారు. గురువారం స్వామివారిని 61,652 మంది దర్శించుకోగా, 22,756 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.34 కోట్ల ఆదాయం లభించింది.