శ్రీవారి సేవలో వృద్ధులు.. నెలలో రెండు రోజులు ప్రత్యేక దర్శనం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివారికోసం తితిదే బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇకపై వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా తితిదే బోర్డు ఏర్పాట్లు చేసింది. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది. ఈ కార్యక్రమ దిగ్విజయంగా నడుస్తుంది కూడా. ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.
ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లు జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తితిదే బోర్డు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అదేవిధంగా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు అక్టోబరు 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.