ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (09:32 IST)

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు... శుక్రవారం అంకురార్పణ

తిరుమల తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం నుంచి అంకురార్పణ జరుగనుంది. ఆ తర్వాత శనివారం ఉదయం ధ్వజారోహణంతో వాహనసేవలు ప్రారంభంకానున్నాయి. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 
 
వాహనసేవలన్నీ సంపగి ప్రాకారంలోని కల్యాణమండపంలో, ఉత్సవమూర్తులకు అలంకరణ, కొలువు, ఆస్థానం, సల్లింపు, శాత్తుమొర, స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలను రంగనాయకమండపంలో నిర్వహించనున్నారు. ఆలయంలోని యాగశాలలో 9 రోజుల పాటు వైదిక కార్యక్రమాలు యధావిధిగానే జరుగనున్నాయి. 
 
ఇదిలావుంటే, తిరుమలలోని కాటేజీల్లో ఉన్న ఏసీ గదుల అద్దెను టీటీడీ పెంచింది. ప్రస్తుతం రూ.1000 ఉన్న అద్దెను రూ.1500 చేశారు. తిరుమలలో రూ.1000 అద్దె ఉన్న గదులు దాదాపు 200 వరకు ఉన్నాయి. వీటి అద్దెను పెంచాలని గతంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఏసీ గదుల అద్దె పెంపు నిర్ణయాన్ని వారం నుంచి అమలు చేస్తున్నారు. జీఎస్టీతో కలిపి గది అద్దె ప్రస్తుతం రూ.1,700కు చేరుకుంది. 
 
మరోవైపు, 2021 సవంత్సరానికిగాను కొత్త డైరీలు, క్యాలెండర్లను తితిదే సిద్ధం చేస్తోంది. 2021వ సంవత్సరానికి సంబంధించి 12 పేజీల ఆయిల్‌ ప్రింటెడ్‌ క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలతో పాటు కొన్ని టేబుల్‌ క్యాలెండర్లు సిద్ధమవుతున్నాయి. 
 
వీటితో పాటు రూ.15 ధరతో శ్రీవారు, అమ్మవారి క్యాలెండర్లు, రూ.20 ధర కలిగిన తెలుగు పంచాంగం క్యాలెండర్లు కూడా తయారవుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు అందించేందుకు ఈ నెల 23న తిరుమలకు వస్తున్న సీఎం జగన్‌ చేతులమీదుగా వీటిని ఆవిష్కరింపజేయనున్నారని సమాచారం.