సామాన్య భక్తులకు టిటిడి ముఖ్య విజ్ఞప్తి, ఏంటది?
సామాన్య భక్తులకు దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని టిటిడి ఒక ప్రకటనలో తెలిసింది. తిరుపతిలో కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వచ్చి పరిస్థితులు మెరుగుపడిన తరువాత సర్వదర్సనం టోకెన్లు జారీని యధాతథంగా పునరుద్ధరిస్తామని వెల్లడించింది.
ప్రధానంగా తిరుపతిలోని కౌంటర్ల ద్వారా రోజుకు 3 వేల సర్వదర్సనం టోకెన్లు ఇవ్వడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువల్ల మొదటిసారి టోకెన్ల జారీని నిలిపివేయడం జరిగిందని టిటిడి స్పష్టం చేసింది.
అయితే ఇప్పుడు తమిళనాడులో పురటాసి మాసం రద్దీ దృష్ట్యా టిక్కెట్ల జారీని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు వెల్లడించింది. తిరుపతిలో రోజుకు 3 వేల సర్వదర్సనం టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయగా తమిళనాడు నుంచి 10 వేల నుంచి 12 వేల మంది భక్తులు క్యూలైన్ల దగ్గరకు వస్తే తిరపతిలో కోవిడ్ వ్యాప్తి పెరిగిపోయే ప్రమాదముందని టిటిడి ఒక అంచనాకు రావడం జరిగింది.
ముఖ్యంగా కొందరు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో సర్వదర్సనం టోకెన్ల కోటాను ప్రత్యేక ప్రవేశ దర్సనానికి కేటాయించడం జరిగిందన్నారు. అంతేగానీ సామాన్య భక్తుల విషయంలో టిటిడికి ఎలాంటి ఇతర ఆలోచన లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లు తీసుకున్న వారికి కూడా సర్వదర్సనమే జరుగుతోంది కానీ మరొకటి కాదన్నారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.