శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2019 (20:28 IST)

తిరుమలలో ఆ సేవలన్నీ రద్దు..?

తిరుమల ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. టిటిడి పాలకమండలితో పాటు అనుబంధ సలహామండళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్ని బాగానే ఉన్నా మరికొన్ని మాత్రం భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయి. ఏకంగాకొన్ని ఆర్జిత సేవలను రద్దు చేయాలని ఆగమ సలహామండలి నిర్ణయం తీసుకుని పాలకమండలి దృష్టికి తీసుకెళ్ళబోతోంది. అది కూడా వందలయేళ్ళ పాటు జరుగుతున్న ఈ ఆర్జిత సేవలను నిలిపివేయాలన్న టిటిడి నిర్ణయంపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 
 
600యేళ్ళ క్రితం లభించిన మలయప్పస్వామి ఉత్సవ మూర్తుల పరిరక్షణ కోసం ఈ సేవలు రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకోనుంది టిటిడి. ప్రతినిత్యం స్నపన తిరుమంజనం నిర్వహించడం వల్ల బింబం అరుగుదల సంభవిస్తుందని టిటిడి సలహామండలి అభిప్రాయపడింది. ఇక నుంచి యేడాదికి ఒకరోజు వసంతోత్సవాలు, సహస్ర కలశాభిషేకం, విశేష పూజలు నిర్వహించాలని ఆగమ పండితులు ప్రతిపాదించారు. 
 
ఇదే విషయాన్ని పాలకమండలి దృష్టికి తీసుకెళ్ళారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. రద్దీ సమయాల్లో సేవలకు వెళ్ళి స్వామివారిని దర్సించుకునే భక్తులకు ఈ సేవలు రద్దు కావడం వల్ల ఇబ్బందులు తప్పవంటున్నారు హిందూ ధార్మిక సంఘాలు.