శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 29 నవంబరు 2020 (19:52 IST)

శ్రీ‌వారి భ‌క్తుల‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

వైష్ణ‌వ సంప్ర‌దాయాన్ని పాటిస్తూ ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేయించ‌డం కోసం తిరుమ‌ల శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని ప‌ది రోజుల పాటు తెర‌చి ఉంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప్ర‌క‌టించారు. పేద ప్ర‌జ‌ల‌కు వివాహాలు ఆర్థిక‌భారాన్ని మిగ‌ల్చ‌కుండా ఉండేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆశీస్సుల‌తో గ‌తంలో అమ‌లుచేసిన క‌ల్యాణ‌మ‌స్తు సామూహిక వివాహ కార్య‌క్ర‌మాన్ని పునఃప్రారంభిస్తామ‌ని చెప్పారు. టిటిడికి దేశ‌వ్యాప్తంగా భ‌క్తులు కానుక‌గా అందించిన ఆస్తుల‌కు సంబంధించి శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేశారు.
 
టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శ‌నివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు వివ‌రించారు. ముఖ్యాంశాలివి. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి వైష్ణ‌వ సంప్ర‌దాయం పాటించ‌డం లేద‌ని గుంటూరుకు చెందిన శ్రీ రాఘ‌వ‌న్ కె తాళ్ల‌పాక హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు, ఆగ‌మ స‌ల‌హామండ‌లి స‌భ్యుల‌తో చ‌ర్చించి సంప్ర‌దాయాలు అమ‌లుప‌ర‌చ‌డానికి నిర్ణ‌యం తీసుకోవాల‌ని హైకోర్టు టిటిడికి సూచించింది.
 
ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌బ్ క‌మిటీని నియ‌మించి దేశ‌వ్యాప్తంగా ఉన్న 26 మంది ప్ర‌ముఖ పీఠాధిప‌తులు, మ‌ఠాధిప‌తుల‌తో చ‌ర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. శ్రీవైష్ణ‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం దేశంలోని అనేక ప్ర‌ముఖ ఆల‌యాలు వైకుంఠ ఏకాద‌శి నుంచి 10 రోజుల పాటు ఉత్త‌ర ద్వారాలు తెర‌చి ఉంచుతున్నార‌ని, తిరుమ‌ల ఆల‌య వైకుంఠ ద్వారాన్ని కూడా 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించాల్సిందేన‌ని ఏక‌గ్రీవంగా రాత‌పూర్వ‌క తీర్మానం చేశారు. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నాం. ఇందులో భాగంగా డిసెంబ‌రు 25వ తేదీ వైకుంఠ ఏకాద‌శి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం క‌ల్పిస్తాం.
 
శ్రీ‌వారి భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన ఆస్తుల‌ను విక్ర‌యించ‌రాద‌ని 28-05-2020న జ‌రిగిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో అన్యాక్రాంత‌మైన‌వి, నిరుప‌యోగంగా ఉన్న‌వి, ఉప‌యోగం లేని భూముల స‌మ‌స్త స‌మాచారంతో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం. దేశ‌వ్యాప్తంగా  స్వామివారికి చెందిన 1128 ఆస్తుల‌కు సంబంధించిన 8088.89 ఎక‌రాల భూముల‌పై ఈరోజు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశాం. ఆక్ర‌మ‌ణ‌లు, ఉప‌యోగం లేనివాటిని ఎలా ఉప‌యోగించాలి అనే విష‌యంపై త్వ‌ర‌లో క‌మిటీ వేసి నివేదిక మేర‌కు త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.
 
డా.వైఎస్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా టిటిడి ద్వారా పేద‌ల‌కు ఎంత‌గానో మేలుచేసే క‌ల్యాణ‌మ‌స్తు సామూహిక వివాహాల కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పునఃప్రారంభించి ఆంధ్ర‌ప‌దేశ్‌లోని ప్ర‌తి జిల్లా కేంద్రంలో సామూహిక వివాహాలు జ‌రిపించ‌డంతోపాటు అదేరోజు అక్క‌డే శ్రీ‌వారి క‌ల్యాణం కూడా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం. ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తాం. కార్య‌క్రమ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ అధికారుల‌ను ఆదేశించాం.
 
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని ధ్వజ‌స్తంభం, బ‌లిపీఠం, మ‌హ‌ద్వారం త‌లుపుల‌కు బంగారు తాప‌డం చేయించాల‌ని నిర్ణ‌యం. తిరుమ‌లలోని ప్ర‌యివేటు సెక్యూరిటీ సిబ్బందికి రూ.2 వేలు యూనిఫామ్ అల‌వెన్స్ మంజూరు చేశాం. టిటిడి ఉద్యోగుల‌కు ఇహెచ్ఎస్ ప‌థ‌కం అమ‌లును వాయిదా వేశాం. దీనిపై ఉద్యోగుల‌కు ఉన్న సందేహాల‌ను నివృత్తి చేసి మ‌రిన్ని ఆసుప‌త్రుల‌ను దీని ప‌రిధిలోకి తెచ్చి ఉద్యోగుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తాం.
 
తిరుమ‌ల న‌డ‌క‌దారిలోని గాలిగోపురాలు ఎండ‌కు, వాన‌కు దెబ్బ తిన్నందువ‌ల్ల వాటిని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని నిర్ణ‌యం. తిరుమ‌ల‌ను ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన ప‌ర్యావ‌ర‌ణ ఆధ్యాత్మిక కేంద్రంగా(హోలి గ్రీన్ సిటి) మార్చ‌డంలో భాగంగా ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల నిషేధాన్ని సంపూర్ణంగా అమ‌లుచేస్తున్నాం. మ‌రో అడుగు ముందుకేసి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం తిరుమ‌ల‌కు 100 నుంచి 150 ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేయించాల‌ని ముఖ్య‌మంత్రికి విన్న‌వించాం. ఇందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణ‌యం అమ‌లు కోసం ముఖ్య‌మంత్రికి లేఖ రాయాల‌ని అధికారుల‌ను ఆదేశించాం.
 
తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా గ్రీన్‌ప‌వ‌ర్‌(సౌర‌, ప‌వ‌న విద్యుత్‌) వినియోగానికి నిర్ణ‌యం తీసుకున్నాం. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలోని సూర్య‌ప్ర‌భ వాహ‌నానికి 11.766 కిలోల బంగారంతో తాప‌డం చేయించ‌డానికి అమోదించాం. తిరుమ‌ల‌లో సాధార‌ణ భ‌క్తులు బ‌స చేసే కాటేజీల మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.29 కోట్లు మంజూరు చేశాం.
 
 కోవిడ్‌-19 కార‌ణంగా కార్య‌క్ర‌మాలు లేక ఇబ్బందిప‌డుతున్న అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌కు రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించాం. టిటిడి ద్వారా స‌నాత‌న హిందూ ధ‌ర్మాన్ని మ‌రింత ముమ్మ‌రంగా ప్ర‌చారం చేయాలని నిర్ణ‌యించాం.
 
ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల‌తోపాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వైభ‌వాన్ని ప్ర‌చారం చేయ‌డానికి కొత్త‌గా 6 ప్ర‌చార ర‌థాలు కొనుగోలుకు ఆమోదం తెలిపాం. ప‌లువురు బోర్డు స‌భ్యులు ఈ వాహ‌నాల‌ను విరాళంగా ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. తిరుప‌తి ఎస్వీ బాల‌మందిరంలో విద్యార్థుల స‌దుపాయం కోసం రూ.10 కోట్ల‌తో అద‌న‌పు హాస్ట‌ల్ బ్లాక్ నిర్మాణానికి ఆదేశాలిచ్చాం. త‌మిళ‌నాడులోని ఊలందూరుపేట ప‌ట్ట‌ణంలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి బోర్డు స‌భ్యులు శ్రీ కుమార‌గురు 4 ఎక‌రాల భూమి, రూ.10 కోట్ల న‌గ‌దు విరాళంగా ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. అక్క‌డ శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.
 
కోవిడ్ నేప‌థ్యంలో బ్యాంకులు వ‌డ్డీరేట్లు బాగా త‌గ్గించినందువ‌ల్ల టిటిడి వ‌ద్ద ఉన్న డిపాజిట్ల‌ను కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల సెక్యూరిటీ ప‌థ‌కాల్లో పెట్టి ఎక్కువ వ‌డ్డీ ల‌భించేలా ప్ర‌య‌త్నించాల‌ని గ‌తంలో ఆలోచించాం. అయితే ప్ర‌స్తుతం కోవిడ్ ప‌రిస్థితులు సాధార‌ణ స్థాయికి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నందువ‌ల్ల జాతీయ బ్యాంకులు, కొన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల‌తో చ‌ర్చలు జ‌రిపి డిపాజిట్ల‌పై ఎక్కువ వ‌డ్డీ ల‌భించేలా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

స‌మావేశంలో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, డా.నిశ్ఛిత‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ దామోద‌ర్‌రావు, శ్రీ కుపేంద‌ర్‌రెడ్డి, శ్రీ వెంక‌ట ప్ర‌సాద్‌కుమార్‌, శ్రీ డి.పి.అనంత‌, శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాధ‌న్‌, శ్రీ ముర‌ళీకృష్ణ‌, అదనపు ఈవో  శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోసినాథ్ జెట్టి పాల్గొన్నారు.