బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (20:21 IST)

దక్షిణాది పుణ్యక్షేత్రాలను రూ.7,140లతోనే చుట్టేయవచ్చు.. ఎలాగంటే?

కోవిడ్ నుంచి జనం ఇంకా కోలుకోలేదు. అయితే అన్ లాక్ ప్రక్రియ కారణంగా జనం బయటి గాలిని పీల్చుకుంటున్నారు. అంతకుముందు ఇంటికే పరిమితమైన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఉద్యోగాలకు వెళ్తున్నారు.. పర్యటనలకు వెళ్తున్నారు.. ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కాస్త రిలీఫ్ కలిగించేలా ఐఆర్‌సీటీసీ ఓ టూర్ ప్యాకేజీనందిస్తోంది.
 
దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలనుకునే వారు ఈ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ఇందులో భాగంగా ఆరు రోజులపాటు టూర్ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం సంస్థ 'ఐఆర్‌సీటీసీ' ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రయాణికులు దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శించుకోవచ్చు.
 
దక్షిణ భారత్ యాత్ర ట్రైన్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే... తిరుచురాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి తదితర ప్రాంతాలను చుట్టిరావచ్చు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలును ఎక్కవచ్చు. ఐఆర్‌సీటీసీ అందించే భారత్ దర్శన్ యాత్ర డిసెంబరు 12న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్‌లో రాత్రి 12 గంటలకు ఈ రైలు బయలు దేరుతుంది. ఈ టూర్‌లో వెళ్ళాలనుకుంటే... రూ. 7,140 చెల్లించాలి. కాగా... ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి చార్జీ ఉండదు.
 
రూ. 7,140 చెల్లిస్తే స్లీపర్ క్లాస్‌లో టికెట్ లభిస్తుంది. అలాగే 3 టైర్ ఏసీలో కూడా ప్రయాణించే అవకాశముంటుంది. ఇందుకోసం రూ. 8,610 చెల్లించాల్సి ఉంటుంది. ఇక భోజనాన్ని ఐఆర్‌సీటీసీనే ఉచితంగా అందిస్తుంది. కాగా... ఈ టూర్ ఆరు రోజుల పాటు సాగుతుంది. ఈ టూర్‌కు వెళ్లాలని భావిస్తే... ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంకేముంది..? దక్షిణ భారత్ లోని ప్రసిద్ధ ఆలయాలను చుట్టేసేందుకు టికెట్లను బుక్ చేసుకోండి.. మరి..!