రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం... ఎందుకు?
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే, దీనికో మెలిక పెట్టారు. ఈనెల 11వ తేదీన వెల్లడికానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కొండల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ప్రకటించారు.
ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, కొడంగల్ అసెంబ్లీ స్థానంలో తాను ఓడిపోతే తప్పకుండా రాజకీయ సన్యాయం స్వీకరిస్తానని తెలిపారు. అయితే, తాను గెలిస్తే సవాల్‌కు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని తెరాస మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
కేటీఆర్ సవాల్‌ను సూటిగా స్వీకరిస్తున్నానని, తాను గెలిచిన మరుక్షణం కేటీఆర్ మాటకు కట్టుబడి... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అన్నారు. లేకుంటే మీది కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, ప్రజాకూటమి గెలుపును కాంగ్రెస్ నేత సోనియాకు కానుకగా ఇస్తామన్నారు. గెలుపును ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నామన్నారు. తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదిలిందని, తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతున్నాయన్నారు.