సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (16:33 IST)

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం సాగుతుంది. కానీ, అధికార భారత రాష్ట్ర సమితి మాత్రం హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదేవిషయాన్ని ఆ పార్టీ నేత, మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. 
 
తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో అతిశయోక్తులు ఉంటాయని, ఎగ్జాక్ట్ పోల్స్ (అసలైన ఫలితాలు) మనకు శుభవార్తను చెబుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను చేశారు. 

భారాస అభ్యర్థికి కారు ఆపిమరీ వార్నింగ్ ఇచ్చిన కొండా సురేఖ 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ నన్నపునేని నరేందర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారాస అభ్యర్థి కారు ఆపి మరీ ఈ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. తమ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
పోలింగ్ సందర్భంగా పెరుకవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తలను కుమార్తె సుస్మిత పటేల్‌తో కలిసి సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. నన్నపునేని దగ్గరకెళ్లిన సురేఖ.. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రదీప్ రావు కలిసిపోవడానికి సిగ్గులేదా, నిన్ను ఈ స్థాయికి ఎవరు తీసుకొచ్చారో తెల్వదా అని నిలదీశారు. 
 
దీంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేఖతో వాదనకు దిగుతూ చేయి లేపగా, ఆ వెంటనే ఆమె పక్కన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అదే పని చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత కొండా సురేఖ మాట్లాడుతూ, చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక... భయపెట్టుడు.. బెదిరించుడు చేస్తే ఒళ్లు పికులుద్ది అని మండిపడ్డారు. దీంతో పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ నరేందర్ అక్కడ నుంచి జారుకున్నారు.