గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (10:37 IST)

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల అధికారమే గొప్పది : మాజీ మంత్రి కేటీఆర్

ktramarao
అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల అధికారమే గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత రాష్ట్ర  సమితికి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యే పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పునకు తలవంచాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. చరిత్ర పునరావృతమవుతుందని, అధికారంలో ఉన్నవారికంటే ప్రజల అధికారమే గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం ఆ పార్టీటి టాటా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం భారాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మొత్తం ఐదుగురు భారాస ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయింది. వీరిలో భారాసకు చెందిన కీలక నేతలు పోచారం శ్రీనివాస రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు ఉండగా, తాజాగా సత్యకుమార్ ఆ జాబితాలో చేరారు.