వారిద్దరూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దారు : మాజీ మంత్రి కేటీఆర్
తమ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన వారిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డిలపై ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దారని, ఇలాంటి వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి, గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. భారత రాష్ట్ర సమితికి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే భారాసకు ఎక్కువ సీట్లు కావాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు.
'బలహీన వర్గాలను ఒక్కటి చేసిన 'బాహుబలి' కాసాని జ్ఞానేశ్వర్. ఆ వర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారి బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మోడీ, ఎన్డీయే కూటమికి 400 కాదు.. 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. కాంగ్రెస్ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.
అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలి. రైతుల దగ్గరకు వెళ్లి రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేరిందా అని అడగాలి. కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు.. కాంగ్రెస్ 100 రోజుల అబద్ధాల పాలన మరో వైపు. బీజేపీ పదేళ్లలో ఏం చేసిందో చెప్పి ఓటు అడగమంటే చెప్పేందుకు ఒక్కటీ లేదు' అని కేటీఆర్ విమర్శించారు.