బుధవారం, 28 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2026 (11:19 IST)

పుట్టిన భూమి సాక్షిగా చెపుతున్నా.. అనైతిక పనులకు పాల్పడలేదు : కేటీఆర్

ktrao
పుట్టిన భూమి సాక్షిగా చెపుతున్నా... తాను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు పంపగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను డ్రగ్స్‌ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని వ్యక్తిత్వహననం చేశారని, ఇపుడు ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో డైలీ సీరియల్‌లా లీకులు ఇచ్చి మా వ్యక్తిత్వహననం చేస్తున్నారనీ, తన పరువు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు.. రేవంత్‌ రెడ్డి బాధ్యుడా..? అధికారులు బాధ్యులా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. 
 
అయినప్పటికీ తమపై ఎన్ని కేసులు పెట్టినా.. భయపడకుండా రాష్ట్రం కోసం పోరాడిన నాయకత్వం మా పార్టీది.. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం.. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. పదేళ్లు రాష్ట్రం కోసమే పనిచేశాం.. ప్రతిపక్షాలను ఎప్పుడూ వేధించలేదు.. విచారణలకు భయపడే ప్రసక్తే లేదు అని కేటీఆర్ అన్నారు. 
 
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారణకు పిలిచి అడిగిందే అడిగి టైంపాస్ చేశారు.. ఇపుడు తనతో కూడా అదే చేస్తారన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందో లేదో సిట్‌ను అడుగుతానని, కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అవుతోంది.. సిట్ దర్యాప్తుకు లీకులు తప్ప, అధికారిక ప్రకటన లేదు.. ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చే వరకు టైంపాస్ చేసేందుకే విచారణకు పిలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. 
 
కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది, ఇది మాత్రం అవ్వట్లేదు.. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్‌, స్టాండ్ అంటే స్టాండ్.. పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. టీవీ సీరియల్‌ను తలపించేలా డ్రామాలు చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు.