శనివారం, 25 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ponnam prabhakar
ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోతున్నాయని, ఇది ఎంతగానో కలిచి వేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని కర్నూలు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్సందించారు. ప్రైవేట్ ట్రావెల్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికు ప్రాణాలు పోతే ఇకపై వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం అడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. 
 
అలాగే, రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతున్నారని, ఈ వేగాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రవాణా శాఖ మంత్రులతో త్వరలో సమావేశమై అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి ప్రయాణికులకు  సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.