1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2023 (08:58 IST)

పని ఒత్తిడి భరించలేక బ్యాంకు మేనేజరు బలవన్మరణం.. ఎక్కడ?

bank manger
తెలంగాణ రాష్ట్రంలోని కొమ్రం భీం జిల్లా వాకిండిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి భరించలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన భార్య, కుమారుడు అనాథలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని వాంకిడి మండలంలోని ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)లో విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేష్‌(35) ఈ నెల 17న విధులు పూర్తయ్యాక.. రాత్రి 7.30 గంటల సమయంలో కార్యాలయంలోనే ముందుగా తెచ్చుకున్న పురుగుమందు తాగారు. అనంతరం వాంతులు చేసుకున్నారు.
 
దీన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది ఏమైందని అడిగితే ఒంట్లో బాగాలేదని సమాధానమిచ్చారు. సిబ్బంది వెంటనే ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. బ్యాంకులో పనిభారం ఎక్కువైందని భార్య ప్రియాంకతో చెబుతుండే వాడని, ఒత్తిడితోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి లక్ష్మీరాజం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.