మాటల్లోనే.. చేతల్లో ఎక్కడ? కేంద్రంపై మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులను విడుదల చేయడం లేదంటూ ఆరోపించారు. గత ఏడున్నరేళ్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవన్నారు. కనీసం ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో అయినా రాష్ట్రానికి విభజన హామీల అమలుతో పాటు తగినన్ని నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు.
ప్రధానంగా విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్‌టైల్, ఫార్మా సిటీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికీ రాలేదని, వాటిని విడుదల చేయాలని కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేపదే "సబ్ కా సాత్ సబ్ వికాస్" అనే నినాదాన్ని వల్లె వేస్తున్నారనీ, కానీ నిధులను మాత్రం ఆయన రాష్ట్రాలకు విడుదల చేయడం లేదని ఆరోపించారు. దేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.