శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (21:28 IST)

తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. నిన్నమొన్నటివరకు అదుపులో ఉన్నాయని భావించిన  ఈ పాజిటివ్ కేసులో మంగళవారం ఒక్కసారిగా ఏకంగా 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1991కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 38 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారు కాగా, 12 మంది వలస కార్మికులు. 
 
రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ లో 6, సూర్యాపేట జిల్లాలో 1, వికారాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, నారాయణపేట జిల్లాలో 1 కేసు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురు కరోనా బారినపడ్డారు. మంగళవారం ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 57కి చేరింది. అటు, ఇవాళ 120 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,284కి పెరిగింది. ప్రస్తుతం 650 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు ఏపీలో కూడా మరో 48 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేసమయంలో 55 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,719 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 759 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,903 మంది డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరిలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 57కి చేరింది.