సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (17:01 IST)

కేసీఆర్‌పై మండిపడిన డీకే అరుణ.. కోట్లతో ఓట్లు కొనుక్కోవడమే తెలుసు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచేసిన అవినీతి సొమ్మంతా ఉందని.. ఆ డబ్బుతో ఎలాగైనా టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు డీకే అరుణ. నాదే అధికారం అనే గర్వం, భ్రమలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. 
 
కిషన్ రెడ్డి ర్యాలీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఉప ఎన్నిక చూసి భయపడుతావా అంటూ కౌంటర్లు వేశారు. కేసీఆర్ కు ఎన్నికలు అంటే కోట్లతో ఓట్లు కొనుక్కోవడమే తెలుసని చురకలంటించారు.
 
అసలు.. కేసీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోందన్నారు డీకే అరుణ. గెలుపు కోసం రోజుకో అబద్ధం ఆడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఇచ్చే ఉద్దేశం లేక, అమలు చేయలేక బీజేపీ మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రభుత్వ భూములు అమ్ముతున్న కేసీఆర్ కు.. దళిత బంధు డబ్బులు ప్రజలకు ఇచ్చే ఉద్దేశమే లేదని చెప్పారు.
 
బీజేపీ మొదట్నుంచి దళిత బంధును పేదలందరికీ అందజేయాలని డిమాండ్ చేస్తోందన్నారు డీకే అరుణ. పథకం ప్రకటించి రెండు నెలలు అయినా ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్న నమ్మకం ఉందని తెలిపారామె.