అందమైన అమ్మాయిల ఫోటోలు డౌన్లోడ్ చేసి వేధింపులు
సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన పి. కిరణ్ కుమార్ రెడ్డి ఫెస్ బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని.. వాటి ద్వారా నకిలీ అకౌంట్ క్రియేట్ చేసాడు. దాని ద్వారా అమ్మాయిల ఫ్రెండ్స్‌తో అసభ్యకర చాటింగ్ చేసాడు. దీంతో ఆ యువతికి కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఓ బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు కిరణ్ కుమార్‌ని ట్రేస్ చేసి అరెస్ట్ చేసారు. కిరణ్ ఇప్పటికే 10 మంది అమ్మాయిలను వేధించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
ఇతనిపై ఇప్పటికే సూర్యాపేట, కోదాడ పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో హైదరాబాద్ లోని కాల్ సెంటర్లలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సూర్యాపేట ఏకారం గ్రామానికి చెందిన టేకుల ఫనిందర్ రెడ్డి.. కాల్ సెంటర్ అమ్మాయిలతో ఫోటోలు దిగి వాటిని మార్ఫింగ్ చేసాడు.
ఆ మార్ఫింగ్ ఫొటోలతో అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసాడు. బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.