తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో ఎన్‌కౌంటర్ - ఆరుగురు నక్సల్స్ హతం
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు భారీ ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నాపురం సమీపంలోని సుక్మా - బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతంలో జరిగింది.
ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులతో కలిస్ గ్రేహోండ్స్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరపడంతో గ్రేహోండ్స్ దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఈ మధ్యకాలంలో కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. దీంతో గ్రేహోండ్స్ దళాలు మావోల కోసం ముమ్మరంగా గాలిస్తూ వచ్చాయి. అలాగే, ప్రత్యేకంగా నిఘా సారించారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ గాలింపు చర్యలు చేపట్టగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.