ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (19:31 IST)

ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు! నిజామాబాద్‌లో వినూత్న ప్రచారం

yellow board
బీజేపీ తెలంగాణ నేత ధర్మపురి అర్వింద్‌ గత 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు. ఆయన ప్రచార మాటలు నమ్మిన నిజామాబాద్ ప్రజలు సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను చిత్తుగా ఓడించి అరవింద్‌కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆయన పసుపు బోర్డు ఏర్పాటుకు ఏమాత్రం కృషి చేయలేదు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యప్తంగా మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ వినూత్నంగా ప్రచారం సాగిస్తూ, పట్టణ వ్యాప్తంగా పసుపు బ్యానర్లు ఏర్పాటు చేశారు. 
 
నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతులు అధికంగా ఉంటారు. కానీ, వారికి ప్రతి యేటా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు పసుపు బోర్డును తీసుకొస్తానని గత పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఆయన గెలుపులో ఈ కీలక హామీ ప్రధానంగా పని చేసింది. అయితే, నాలుగేళ్లు పూర్తయిన పసుపు బోర్డు రాలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పట్టణ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. 
 
"పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు" అంటూ వెటకారాన్ని యాడ్ చేసి పట్టణ వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలను అంటించారు. ఈ బోర్డులను కూడా పసుపు రంగులో పెట్టి.. అసలైన బోర్డును తీసుకుని రాలేదంటూ నిలదీశారు. అయితే, ఈ ఫ్లెక్సీలపై ఊరు పేరు లేకపోవడం గమనార్హం. మొత్తంమీద ఈ పసుపు బోర్డు ఫ్లెక్సీలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.