శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (11:33 IST)

ప్రయాణీకులకు షాకింగ్ న్యూస్... క్యాట్ కార్డులకు మంగళం పాడిన ఆర్టీసీ

ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకులకు షాకిచ్చింది. క్యాట్ కార్డును రద్దు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు విహారి, వనిత కార్డులను కూడా రద్దు చేసింది.


ప్రయాణికుల ఆదరణ తగ్గడంతో కార్డులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. క్యాట్ కార్డు కొనండి.. బస్సుల్లో రాష్ట్రమంతా రాయితీపై ప్రయాణించండి అంటూ ప్రచారం చేసి, మంచి రాబడి పొందింది ఆర్టీసీ. కానీ 15 సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగిన ఈ కార్డుకు ఆర్టీసీ తాజాగా మంగళం పాడేసింది. 
 
వాస్తవానికి ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు తొలుత క్యాట్‌ కార్డును పరిచయం చేశారు. ఏడాదికి రూ.250 చెల్లించి కార్డు తీసుకుంటే.. అన్ని బస్సుల్లో టికెట్‌పై 10 శాతం రాయితీ లభించేది.

ఇదే కార్డును రెన్యువల్‌ చేసుకోవాలనుకుంటే రూ.150 చెల్లిస్తే సరిపోయేది. దాంతో కార్డుకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మొదట్లో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రమంగా ప్రయాణం చేసేవారు ఎగబడి కార్డులు తీసుకునేవారు. దీంతో సంవత్సరానికి 5-6 లక్షల వరకు కార్డులు అమ్ముడుపోయేవి. ఉమ్మడి ఏపీలో కార్డులకు విపరీతమైన గిరాకీ ఉండేది. 
 
కానీ, ఇప్పుడు బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోవడంతో కార్డులకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. అందుకే ఆర్టీసీ యాజమాన్యం రాయితీ కార్డులపై అధ్యయనం కోసం కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ కార్డులను నిలిపివేస్తూ.. నిర్ణయం తీసుకుంది.