శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 28 జులై 2021 (18:16 IST)

తెలంగాణాలో 90.5 శాతం మందికి ప్రభుత్వ రేషన్

తెలంగాణాలో కొత్త‌గా మూడు ల‌క్ష‌ల‌కు పైగా రేష‌న్ కార్డులు అందిస్తున్నారు. గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ‌ లక్ష్మి చెక్కులు పంపిణి కార్య‌క్ర‌మంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కార్డుల పంపిణీ సందర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ, కొత్త‌గా  3,09,083 కార్డుల‌ను అందిస్తున్నామ‌ని, దీని కింద  8,65,430 లబ్ధిదారులున్నార‌ని చెప్పారు. నెలకు అదనంగా 14 కోట్ల విలువగల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి చేస్తున్నామ‌న్నారు.
 
 సంవత్సరానికి రేషన్ పై రూ. 2766 కోట్ల నిధుల్ని వెచ్చించనున్నామ‌ని తెలిపారు. పాతవి దాదాపు 87.41 లక్షల కార్డులు, లబ్ధిదారులు 2కోట్ల 79 లక్షల 23వేలకు అదనంగా కొత్త కార్డులతో కలిపి, ప్రస్థుతం రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు, లబ్ధిదారులు 2కోట్ల 88లక్షల మంది ఉన్నార‌ని తెలిపారు.  ప్రతినెల దాదాపు 231 కోట్లతో సంవత్సరానికి 2766 కోట్ల రూపాయల్ని ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
 
రాష్ట్ర జనాభాలో 90.5 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తోంద‌ని చెప్పారు. ప్రతీ పేదవాడి కడుపు నింపడమే‌ కేసీఆర్ లక్ష్యం అని చెప్పారు హ‌రీష్ రావు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా 90.5 శాతం ప్రజలకు బియ్యం ఇస్తున్నారా అని ప్ర‌శ్నించారు. కొందరు బీజేపీ నేతలు  కళ్యాణ లక్షి పథకాన్ని పరిగె ఏరుకోవడంతో పోల్చార‌ని, కళ్యాణ లక్ష్మి పథకం వద్దని బీజేపీ నేతలు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.

బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. తెరాస ఎన్నికల కోసమే పనులు‌చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారు... తెరాస తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ... ప్రజలు తెలివైన వారు, అంతిమంగా పని చేసే వాళ్లకే తమ మద్ధతిస్తారు... ప్రజల‌ కష్టాలు తీర్చడమే మా ఎజెండా అని చెప్పుకొచ్చారు.