గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (10:00 IST)

కొంతమందిని తాను నచ్చకపొవచ్చు.. తెలంగాణ దూసుకుపోతుంది : గవర్నర్ తమిళిసై

tamizhisai
కొంతమందికి తాను నచ్చకపోవచ్చని, కానీ, తెలంగాణ రాష్ట్ర మాత్రం అన్ని రంగాల్లో దూసుకునిపోతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. పైగా, అంబేద్కర్ రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్ర కొత్తగా ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అదేసమయంలో చరిత్రకు సాక్ష్యాలైన పాత భవనాలను కూల్చి కొత్త భవనలాను నిర్మించడం అభివృద్ధి కాదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 
 
భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆమె గురువారం రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హాజరయ్యారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. 
 
డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ పూర్తి సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని.. నేషనల్ బిల్డింగ్‌ను అభివృద్ధి అంటారని గుర్తుచేశారు. ఫామ్ హౌస్‌లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదన్నారు. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు. తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం కాదని, పుట్టుకనుంచే ఉందని అన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.