సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (15:40 IST)

ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలిపినా కలుపుతారు.. హరీష్ రావు

ఆంధ్రప్రదేశ్ విభజన లోపభూయిష్టంగా ఉందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాడిన‌ అమరులను ప్రజలను పార్లమెంటు సాక్షిగా అవమానపరిచారని దుయ్యబట్టారు.
 
ఆంధ్రాలో మళ్లీ తెలంగాణను కలిపినా కలుపుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై మోదీ తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నేతృత్వంలో దూసుకెళ్తున్న తెలంగాణ‌ అభివృద్ధిని చూసి ఓర్వలేక మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. 
 
నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని కించపరిచిన మోదీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఎలా సమర్థిస్తారని హరీష్ నిలదీశారు. 
 
మోదీ పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. పేదలను పట్టించుకోకుండా పెద్దలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను, రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
 
దేశంలో వలస కార్మికుల వల్లే కరోనా వ్యాప్తి పెరిగిందని ప్రధాని మాట్లాడటం సిగ్గుచేటని హరీష్ రావు ఫైర్ అయ్యారు.. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..? అని నిలదీశారు. ట్రంప్ సభలు, ఎలక్షన్ ర్యాలీలతో రోనా పెరగలేదా అని మంత్రి ప్రశ్నించారు.