1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:46 IST)

భారీ వర్షాలు.. హై అలర్ట్‌ను ప్రకటించిన జీహెచ్ఎంసీ

భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్‌ను జీహెచ్ఎంసీ ప్రకటించింది. మరో గంట పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ సూచించింది. సమస్యల ఫిర్యాదులకు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ 040-21111111 ఏర్పాటు చేసింది.
 
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, మెహదీపట్నం, టోలీచౌకి, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో భారీ వర్షం పడింది. వరద నీరు రోడ్డు పైకి వచ్చింది.

దీంతో హైటెక్‌ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.