శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:34 IST)

భర్త వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

సామాన్య ప్రజలను వేధిస్తే వారి తాట తీసేందుకు పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే మహిళలకే భర్త నుంచి వేధింపులు ఎదురైతే. ఇదే జరిగింది. ఏ రంగంలో పనిచేసినా.. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పటంలేదు. ఈ క్రమంలో ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
ఈ ఘటన హైదరాబాద్ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కవాడీగూడలో నివాసముంటన్న లత అనే 23 ఏళ్ల కానిస్టేబుల్ పీఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. లత భర్త లక్ష్మీ నరసింహ సింగరేణి కాలరీస్‌ ఆఫీస్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. భార్యను తరచు వేధింపులకు గురిచేస్తుండేవాడని లత కుటుంబ సభ్యులు..స్థానికులు తెలిపారు. అయినా ఓర్చుకుంటూ తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న లత మితిమీరిన భర్త వేధింపులు భరించలేక తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.