మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (14:38 IST)

జీహెచ్ఎంసీ పరిధిలో రెండో జోన్లు లేవు.. దుష్ప్రచారం చేస్తే జైలుశిక్షే..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నాలుగు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో రెడ్‌ జోన్లు లేవని తేల్చి చెప్పారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న ప్రచారం అవాస్తమన్నారు. ఇలా దుష్ప్రచారం చేస్తే మాత్రం జైలుశిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. 
 
మరోవైపు, ఈ రెడ్ జోన్ల వ్యవహారంపై కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్పందించారు. రెడ్‌ జోన్‌ ఉన్నట్లు మార్ఫింగ్‌ చేసిన ఫ్లెక్సీలు పెడుతున్నారన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో రెడ్‌ జోన్‌ ఎక్కడా ప్రకటించలేదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. 
 
అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, నగరంలో ఎక్కడా రెడ్‌ జోన్‌లు లేవని స్పష్టం చేశారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.