హైదరాబాద్ నగరంలో రెడ్ జోన్ ప్రాంతాలు ఏవి?

red zone
ఠాగూర్| Last Updated: శనివారం, 28 మార్చి 2020 (11:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ.. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా మరో పది కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించింది. చందానగర్‌, కోకాపేట, తుర్కయంజాల్‌, కొత్తపేట ప్రాంతాలను రెడ్‌జోన్‌లో చేర్చింది. ఈ ఈ ప్రాంతాల వారు వంద శాతం ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. పద్నాలుగు రోజులపాటు వీరు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, నిత్యావసరాలు కావాలంటే వారి ఇళ్లకే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది.

మరోవైపు, భాగ్యనగరంలో ఉన్న చారిత్రక మక్కా మసీదును శుక్రవారం పూర్తిస్థాయిలో మూసి వేశారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో మక్కా మసీదులో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు పోలీస్‌ అధికారులు, మైనార్టీశాఖ అధికారులు అనుమతులు నిలిపివేశారు.

గత కొన్ని రోజులుగా హైద్రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతోపాటు మత పెద్దలు మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహించడానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు.

గతంలో నగరంలో తలెత్తిన మత ఘర్షణల సమయంలోనూ, నగరంలో నిరంతరం కొనసాగిన కర్ఫ్యూ వాతావరణంలోనూ మక్కా మసీదులో ప్రార్థనలకు ఎలాంటి షరతులుగాని గతంలో చేపట్టిన దాఖలాలు లేవు. కానీ ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మక్కా మసీదులో అధికారులు ప్రార్థనలను నిషేధించారు.దీనిపై మరింత చదవండి :