శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (17:17 IST)

హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం - పది మంది అరెస్టు!

popula front of india
హైదరాబాద్ నగరంలో భారీ ఉగ్రకుట్రకు పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రంగంలోకిగిన ప్రత్యేక బృందం (సిట్) పోలీసులు హైదరాబాద్ నగరంలోని ముసారాంబాగ్‌లో నివాసముంటున్న జావేద్ అనే వ్యక్తితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
దేశంలో ఉగ్రవాదులకు నిధుల సేకరణ, ఉగ్ర సంస్థలకు రిక్రూట్స్‌మెంట్‌కు పాల్పడినందుకుగాను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ఇటీవల సోదాలు చేసింది. ఈ సోదాల్లో లభించిన కీలక పత్రాల ఆధారంగా ఆ సంస్థ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ఐదేళ్లపాటు నిషేధం విధించింది. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పీఎఫ్ఐలో క్రియాశీలకంగా ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో హైదరాబాద్‌ ముసారాంబాగ్‌లో నివాసముంటున్న జావేద్‌ను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన బాంబుదాడి కేసులో జావేద్‌ను నిందితుడిగా అనుమానించి విచారించారు. 
 
అర్థరాత్రి ముసారాంబాగ్‌తో పాటు చంపాపేట్‌, సైదాబాద్‌, బాబానగర్‌, సంతోష్‌ నగర్‌లోని మరికొందరి ఇళ్లలో కూడా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాయంతో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 10మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 
 
ఉగ్రదాడుల కోసం కొంతమంది యువకులను జావేద్‌ ఇప్పటికే రిక్రూట్‌ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో దాడులకు తెగబడి మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిట్‌ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ అరెస్టులపై సిట్ బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.