మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:46 IST)

ఇంటర్ విద్యార్థి బలవన్మరణం: సీనియర్లు గుట్కా ప్యాకెట్ తెమ్మన్నారు.. చివరికి?

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. జ్యోతి రావు పూలే కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యంతో పాటు సీనియర్ల బలవంతం ఆ విద్యార్థి పట్ల శాపంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. కరుణాపురంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ హాస్టల్‌లో శాయంపేటకు చెందిన భరత్ ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే హాస్టల్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీనియర్స్ గుట్కా పాకెట్స్ తీస్కొని రమ్మని సోమవారం భరత్‌పై ఒత్తిడి చేశారు.
 
గుట్కా ప్యాకెట్స్ తీసుకువచ్చిన సమయంలో భరత్ వాచ్‌మెన్‌కి కనపడడంతో భరత్‌ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో విషయం భరత్ తల్లి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఏంచేయాలో తెలీక భరత్ కాలేజి నుండి చెప్పకుండా వెళ్ళిపోయి ఇంటికి చేరుకున్నాడు. మనస్తాపంతో పరకాల శాయంపేటలోని తమ పొలం దగ్గర గడ్డి మందు తాగి ఇంటికి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. 
 
అతని మొహం చూసిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి పరకాలలోని హాస్పిటల్‌లో చేర్చగా అప్పటికే సీరియస్ అయింది. దీంతో అతడిని వరంగల్ ఎంజీఎంకి తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించాడు. కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం తమ కుమారుడి చావుకు కారణం అయ్యిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.